పోచిరాజ శతకము
(నిత్య సత్య సూక్తులు)
ముందు మాట
ఆంధ్ర సాహిత్య చరిత్రలో శతకము ఒక శక్తివంతమైన ప్రక్రియ.శతకములలో నీతి,భక్తి,వైరాగ్య,శృంగార శతకము లున్నాయి.ఎక్కువగా నీతి,భక్తి శ్తతకాలే కనిపిస్తాయి.ప్రజాబాహుళ్యంలో వేమన శతకం,సుమతీ శతకం ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.ఎంతోమంది కవులు ఎన్నోశతకాలు
వ్రాసారు.ఇప్పుడు కూడా వ్రాస్తున్నారు.
సంస్కృతాంధ్ర పండితులు,బహు గ్రంథ కర్తలు అయిన శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారితో అనంతఛందము గ్రూపు ద్వారా
నాకు పరిచయ భాగ్యం కలిగింది. పోచిరాజు అన్నయ్యగారు వ్రాసిన ఈ పోచిరాజ శతకానికి
ముందుమాట వ్రాయుమని నన్ను కోరడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ శతకం అద్భుతమైన,సార్వజనీనమైన నీతులతో అలరారుతూ ఉంది.దీనిలో సామాజిక పరంగా,కుటుంబపరంగా ఎన్నో నీతులు
వెలువరించారు.కోపమును ఓపికతో ఆపడాన్ని పొంగిన పాలను నీటితో ఆపినవిధంగా అని చక్కని
ఉపమానంతో పోల్చడం ఎంతో మనోహరంగా ఉంది.వినయమబ్బని విద్య, వినియోగము లేని సొమ్ము మొలకెత్తని విత్తనములన్నారు.దానధర్మాలు చెయ్యడం వలననే
ధనమున్నందుకు సార్థకత అన్నారు.దుష్టజన స్వార్థాచరణ సమాజమును నశింప జేస్తుందని
చెప్పడానికి శరీరంలోని రాచపుండుతో పోల్చడం విశేషం. కాపురుషుల సాంగత్యం సద్గుణాలను
కప్పివేస్తుందని చెప్పడానికి సుయోధనుని చేరి కర్ణుఁడు పాపిగా మారాడని
దృష్టాంతాన్ని చూపి భారతకథను జనులకు జ్ఞప్తికి తెచ్చారు.
ఇలాంటి సామాజిక పరమైన నీతులెన్నో ఈ
శతకంలో చోటు చేసికొన్నాయి.
స్త్రీధర్మాలను గురించి అన్నయ్యగారు నాలుగైదు పద్యాలలో చెప్పేరు. పుట్టింట్లో
మెట్టినింటిని తిట్టవద్దని,మెట్టినింట్లో
పుట్టినింటిని అతిగా పొగడవద్దని చక్కని నీతిని బోధించారు.మృదువైన మాటలను మితముగా
పలకాలని,వేగముగా హితమైన పనులు చేసే సతులు మాన్యులని అన్నారు.వలపులు లలనాస్త్రములని, అలుకలు నిశితాసిధార అని,అంబకధారలు అశనిపాతములని
అన్నారు. స్త్రీపరంగా చెప్పిన ఈ నీతులతో పాటు స్త్రీల పట్ల పురుషుల బాధ్యతను కూడా
చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది.ఇంటా బయటా కూడా పనిచేసే భార్యలపట్ల భర్తయొక్క
కర్తవ్యాన్ని,ఉద్యోగరీత్యా బయట తిరిగే స్త్రీలపట్ల పురుషుల ప్రవర్తన ఎలా ఉండాలన్నది
తెలియజేసి ఉంటే బాగుండేది.అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకొనుట కోడలి బాధ్యతలాగే
కోడలిని కూతురుగా చూసుకోవడం అత్త బాధ్యత అనికూడా గుర్తుచేసే అవసరం ఉందని
నాకనిపించింది.(నేను సమాజంలో చూసిన కొన్ని సంఘటనలను బట్టి)
ఈశతకంలో పోచిరాజు అన్నయ్యగారు మనిషి శీలవంతుడుగా మారడానికి, బ్రతుకులు దిద్దుకొని ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించడానికి
ఉపయోగపడే అనేక నీతులను బోధించారు.
కందపద్యాలలో మనోహరంగా సూక్తులను పాఠకులకు అందించిన పోచిరాజు అన్నయ్యగారిని
అభినందిస్తూ,
ముందుమాట వ్రాసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు
తెలుపుతూ –
కన్నేపల్లి వరలక్ష్మి,
విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని, సెయింట్ జోసెఫ్స్ సెకండరీస్కూల్ , మల్కాపురం, విశాఖపట్నం-16.
పోచిరాజ శతకము
(నిత్య సత్య సూక్తులు)
|
శ్రీనాథుఁ గొలిచి గురువుల మానుగ జననీజనకుల మది దలఁచి తమి న్నేనుడివెద సూక్తులను ని దానముగం బోచిరాజతనయా వినుమా |
1.
|
|
|
|
|
సురలే జననీజనకులు గురువులు వారిని విడువ నిగూఢ సురలకున్ నరులం దయఁ జూడఁగ రాఁ దరమగునే పోచిరాజతనయా వినుమా |
2.
|
|
|
|
|
నగవులఁ బతి నలరింపఁగ మగువ కెపుడు పూజ్యు లత్తమామలు సూడం దగుఁ దల్లిదండ్రుల సరణిఁ
దగులంబునఁ బోచిరాజతనయా వినుమా |
3.
|
|
|
|
|
వ్యర్థపుఁ బలుకులు నిత్యా నర్థములు వలదు వికటపు నగవులు తగునే యర్థవినాశము మఱలు ప్ర త్యర్థులకుం బోచిరాజతనయా వినుమా |
4.
|
|
|
|
|
తీయని మాటల వారికి నీయకుమీ చనువు వారి నేవిధ మైనన్ సాయము సేసి విడువ శుభ దాయకమే పోచిరాజతనయా వినుమా |
5.
|
|
|
|
|
ఉబ్బకుమీ జనులు వొగడ నిబ్బరమే సంకటముల నిత్యము గాచున్ జబ్బుల నిన్నెవరు గనరు తబ్బిబ్బునఁ బోచిరాజతనయా వినుమా |
6.
|
|
|
|
|
పలుకకుమీ పరుల యెదుట కలతలు గృహమునఁ జెలగినఁ గాంతుని తోడం జెలిమిని మంతనము సలుపఁ దలఁగును గద పోచిరాజతనయా వినుమా |
7.
|
|
|
|
|
కోపము మానవ సహజము వాపఁగ వలె నోర్మి తోడఁ, బాళపు తోయం బాపదె పొంగెడు పాలను దాప మణఁచి పోచిరాజతనయా వినుమా |
8.
|
|
|
|
|
నిక్షిప్త ధన మవసరము రక్షణ నిడ దానధర్మ రతినిం బుణ్యం బక్షయము పాప సంప్రా ప్తక్షయమగుఁ బోచిరాజతనయా వినుమా |
9.
|
|
|
|
|
మేలిమి పూవులు నగలును జేలము కాయమున కిచ్చుఁ జెలువము మదికిన్ శీలము శాంతము కరుణయుఁ దాలిములే పోచిరాజతనయా వినుమా |
10. |
|
|
|
|
సత్యము నిలుపును జనులను నిత్యము ధర్మపథ మందు నిర్ద్వంద్వముగన్ గత్యంతానృతమైన స దా త్యజితము పోచిరాజతనయా వినుమా |
11. |
|
|
|
|
పిల్లలు పోరుదు రాటల సల్లాపములన్ సరసతఁ జక్క బఱపరే మెల్లనఁ బెద్దలు తగునే తల్లడపడ పోచిరాజతనయా వినుమా |
12. |
|
|
|
|
అక్కర నార్తులఁ గావఁగఁ జిక్కక మద మత్సరముల శిష్టత నుండన్ మిక్కుటముగ నిహ పరములు దక్కునులే పోచిరాజతనయా వినుమా |
13. |
|
|
|
|
ధాన్యధనాదులు దాఁచిన శూన్య మగు మధుపము మధువు సూడఁగ సర్వం బన్యుల పాలైనట్టుల దైన్యముగం బోచిరాజతనయా వినుమా |
14. |
|
|
|
|
నీదు మనోభావ మొకటె కాదు పరుల భావ మరసి కమనీయముగన్ వాదన సేయం దగును గ దా దయతోఁ బోచిరాజతనయా వినుమా |
15. |
|
|
|
|
చీటికి మాటికి నన్యుల వీటికి నేఁగుట వికటపు వేడుక జుమ్మీ బోటులు నాథుని మాటలు దాఁటరు కద పోచిరాజతనయా వినుమా |
16. |
|
|
|
|
వలపులు లలనాస్త్రములే యలుకలు నిశితాసిధార లంబక ధారా జలము లశని పాతములే
తలఁపఁ దరమె పోచిరాజతనయా వినుమా |
17. |
|
|
|
|
మితముగ మృదువగు మాటల హితముగఁ జేతలును రయ సహితమై చలుపన్ సతు లిల మాన్యులు గద సం తత మరయం బోచిరాజతనయా వినుమా |
18. |
|
|
|
|
అపరాహ్నపుఁ దానంబులు విపరీతపు జాప్యములును వికటపు నిద్రా జపము పగలందు తగదు క ద పని వదలి పోచిరాజతనయా వినుమా |
19. |
|
|
|
|
వేగిరపాటు లనర్థము లీఁ గల వలసత్వము వల దెందును దానన్ రాఁగల విడుము లతి సదా
త్యాగమె చుమి పోచిరాజతనయా వినుమా |
20. |
|
|
|
|
పూజాదు లున్ననిలు నీ రాజనముల వెలుగు కోవెల విశేషముగన్ వ్యాజ మెఱుఁగని పురము స ద్రాజితమగుఁ బోచిరాజతనయా వినుమా |
21. |
|
|
|
|
చంచల మెప్పుడు చిత్త మ చంచల ధృతి దాని నన్య సత్కార్యములం బంచ దురాలోచనలను దంచును గద పోచిరాజతనయా వినుమా |
22. |
|
|
|
|
కల్ల కపటంబు లెఱుఁగరు పిల్లలు పెరిగిన కొలదియు పేరాశీసుల్ పెల్లుకొనవె మిక్కుటముగఁ దల్లడపడఁ బోచిరాజతనయా వినుమా |
23. |
|
|
|
|
విజయమె లక్ష్యము విద్యల నిజ వృత్త్యాదులను కేళి నివహమ్ములనున్ సుజనత వీడం దగదు క ద జనులకుం బోచిరాజతనయా వినుమా |
24. |
|
|
|
|
బల ధన గరిమల దాఁటం గల వారెవ్వరు నితాంత కాలమహిమ బా ముల కృతముల నిహ పరములు దలకొను మఱి పోచిరాజతనయా వినుమా |
25. |
|
|
|
|
కనిపించుఁ గొన్ని దృష్టికి వినఁ దాఁకినఁ దెలియుఁ గొన్ని విశ్వేశ్వరునిం గన శరణము భక్తియ సా ధనములు గద పోచిరాజతనయా వినుమా |
26. |
|
|
|
|
అరయం గలమే కన్నులఁ బరమాణువులన్ విదితము వాని యునికియుం బరమాత్ముఁడు సత్యం బీ
ధరకు న్గతి పోచిరాజతనయా వినుమా |
27. |
|
|
|
|
ప్రకృతి పరిశోధ నార్జిత
సుకృతమ్ములు శాస్త్ర తతులు సూత్రేతరముల్ వికృతమని విడువఁ దగదు క ద కృతములను బోచిరాజతనయా వినుమా |
28. |
|
|
|
|
అలవోకగ నగును పనులు పలుకులు మధురంబు లైనఁ బరుషము లాడం గలవరమె మిగులు నిత్యము దలపోయఁగఁ బోచిరాజతనయా వినుమా |
29. |
|
|
|
|
కోప మొసఁగు ననిశము సం తాపము శాంత గుణ మింత తగురీతిఁ దమిం జూపిన రా విడుములు దరి దాపులకుం బోచిరాజతనయా వినుమా |
30. |
|
|
|
|
వినయం బబ్బని విద్యలు వినియోగము గాని సొమ్ము వెడ పనికిన్ రా వనిశము మొలకెత్తని వి త్తనముల వలెఁ బోచిరాజతనయా వినుమా |
31. |
|
|
|
|
వెలుపలఁ దిరుగాడు విరో ధులకున్ మిన్న మనలోన దుస్తరములు నై మెలఁగెడు నరి వర్గమ్ములు దలఁపఁగ నిలఁ బోచిరాజతనయా వినుమా |
32. |
|
|
|
|
తెలియనివి యెఱుఁగ రన్నియుఁ దెలియు ననుచు విఱ్ఱవీఁగి తెంపరులై మూ ర్ఖులు దెలిసిన వారలకు వె తల నిత్తురు పోచిరాజతనయా వినుమా |
33. |
|
|
|
|
పరుల కిడుఁ బాలు గోవులు తరువు లొసఁగు ఫలము లుదక ధారి జలములన్ పరుల కుపకారమున కి ధ్ధర మేనులు పోచిరాజతనయా వినుమా |
34. |
|
|
|
|
తను దానుం బొగడఁగ రా దు నరుల కెపుడు పరనింద దోషము సుమ్మీ వినయమె ఘన భూషణమై తనరారును బోచిరాజతనయా వినుమా |
35. |
|
|
|
|
ధనమున్న మెండు బాంధవ జనులు సఖులు ధనము వెంటఁ జనుదురు నరులున్ ధనహీనునిఁ గన రక్కట తనవారును బోచిరాజతనయా వినుమా |
36. |
|
|
|
|
దానము నతి గుప్తంబుగ మానుగ సత్కార్యములను మనుజుల యెదుటం గా నీయఁగఁ గృతకృత్యుఁడె తా నింపుగఁ బోచిరాజతనయా వినుమా |
37. |
|
|
|
|
నియతంబైన వెతలు సం శయాత్మక గతియె గుణమ్ము సనఁ గృఛ్రములన్ భయహీనం బగు భగవ ద్దయ గల్గిన బోచిరాజతనయా వినుమా |
38. |
|
|
|
|
పదునాల్గు భువనములఁ దా నుదరంబున నిల్పిన జగ దుద్ధర్తృనకుం దుదియే భారత దేశము తదవధియే పోచిరాజతనయా వినుమా |
39. |
|
|
|
|
సంతోష మిచ్చు జనులకు సంతత మారోగ్యము నిల సంతాప మికం బంతముఁ బూని సెఱచుఁ గద తంతుల నిఁకఁ బోచిరాజతనయా
వినుమా |
40. |
|
|
|
|
రాచకుఱుపు మేనుఁ జెఱచు దోఁచు నతని ప్రాణమింక దుష్ట జనస్వా ర్ధాచరణ మెల్ల జనుల స దా చెఱచును బోచిరాజతనయా వినుమా |
41. |
|
|
|
|
చిక్కకు దురాశ లందును స్రుక్కకు నైరాశ్యమునను రోయకు వెతలం జిక్కులకుఁ బరిష్కారము దక్కును ధృతిఁ బోచిరాజతనయా వినుమా |
42. |
|
|
|
|
అన్య ధనాశయు దాన వ దాన్యాసూ యార్తి ఘోర తాపత్రయ మా యన్య మత నింద వీడిన ధన్యుండగుఁ బోచిరాజతనయా వినుమా |
43. |
|
|
|
|
కనిపింపని దైవమ రా తిని నుండెడి కప్పకున్ గతి యనన్ జన జీ వనమున కాధారమ్ము గ ద నిక్కముగఁ బోచిరాజతనయా వినుమా |
44. |
|
|
|
|
ఛాయ వలెఁ దఱుము మృత్యువు కాయంబు లనిత్యముల్ సుకర్మావలియే ప్రాయమ్మున ధర్మంబు గ
దా యిద్ధరఁ బోచిరాజతనయా వినుమా |
45. |
|
|
|
|
భృత్యులఁ బ్రోచును దేవుం డత్యద్భుతముగఁ గనపడు నాతని మహిమల్ ప్రత్యక్షముగాఁ జేయఁడు దైత్య రిపుఁడు పోచిరాజతనయా వినుమా |
46. |
|
|
|
|
కర్మానుసరణి
బుద్ధియ ధర్మాధర్మము లెఱుఁగక తాఁ జేసిన దు ష్కర్మంబు లమోఘమ్ములు ధర్మం బిది పోచిరాజతనయా వినుమా |
47. |
|
|
|
|
ఆచార్యత్రయ వచనము లాచరణీయములు శంకరాచార్యుల వా గ్రోచుల రామానుజ మ ధ్వాచార్యుల పోచిరాజతనయా వినుమా |
48. |
|
|
|
|
ఫల పుష్పామల తోయా దుల హరి గొలిచిన నఘములు తుత్తునియ లగున్ బలమైన భక్తి మనమునఁ
దలరారఁగఁ బోచిరాజతనయా వినుమా |
49. |
|
|
|
|
పటుతర దేహము కల దని కటువుగ భాషింపఁ దగదు కండలఁ గనుచుం ద్రుటిఁ బోవును గాయమ్ములు దటపట పడి పోచిరాజతనయా వినుమా |
50. |
|
|
|
|
సంపద లశాశ్వతములే పెంపులు పతనాంతము లిల వెడలును భవముల్ సొంపైన యట్టి స్నేహము తంపు లగుం బోచిరాజతనయా వినుమా |
51. |
|
|
|
|
పరిపక్వ ఫలము
పతనే తర భయ మెఱుఁగదు
నరులకు తద్విధి మరణే తరమైన భయము
లే దీ ధరణిఁ దలఁపఁ బోచిరాజతనయా వినుమా |
|
|
స్తంభాధారిత సౌధము కుంభినిఁ గాలశిథిల మయి కూలంగ జరా జృంభణమున మృతులు నరులు దంభము సెడఁ బోచిరాజతనయా వినుమా |
52. |
|
|
|
|
సాగరము చేరిన జలము సాగదు కద నదికిఁ దిరిగి శార్వరి చనినం దే గల వారెవ్వ రిల య థాగతినిం బోచిరాజతనయా వినుమా |
53. |
|
|
|
|
వేసవి వేఁడికి నింకెడిఁ గాసార జలముల భంగి గడువన్ దినముల్ తా సన్నగిలు ని జాయువు త్రాసముగం బోచిరాజతనయా వినుమా |
54. |
|
|
|
|
చల నాచలనమ్ముల నై న లయంబగు నాయువు తరణార్థము నన్యం బుల విలపింపక సుగతులు దలఁప వలెను బోచిరాజతనయా వినుమా |
55. |
|
|
|
|
తన తోడనె చను మృత్యువు దన తోడనె యది నిలుచును దనతోడనె సా గును దూరం బిక మరలును దనతోడనె పోచిరాజతనయా వినుమా |
56. |
|
|
|
|
సూర్యోదయ విభవమ్ముల సూర్యాస్తమ యారుణత్విషుల మోహితులై యార్యు లెఱుఁగ రాయుశ్చ్యుతి ధైర్యంబున పోచిరాజతనయా వినుమా |
57. |
|
|
|
|
జీవు లిల తమతమ మనో భావేచ్ఛల వర్తిలంగ వశులే మృతులన్ భావించి హృదిం దగునే తా వగవం బోచిరాజతనయా వినుమా |
58. |
|
|
|
|
జననీ జనకులు విజ్ఞత నొన గూర్చుగురువు గురుత్ర యోచ్చారితులై చన వారల మించు గురువు దన కెప్పుడు పోచిరాజతనయా వినుమా |
59. |
|
|
|
|
క్షమలేని నరుని మానము ప్రమత్తు సిరి నీతిబాహ్యు ప్రాభవ గరిమల్ సమములు భిన్నఘట కబం ధముల కెపుడు పోచిరాజతనయా వినుమా |
60. |
|
|
|
|
క్రోధము పనులం జెఱచును గ్రోధము బహు దుఃఖకారి కుశలత సురుగుం గ్రోధము తాల్మిని వీడినఁ దా ధన్యుఁడు పోచిరాజతనయా వినుమా |
61. |
|
|
|
|
మానప్రాణ ధనములకు హానికరమ్ము మదిర విలయాన్వితము సురా పానము విడువంగ వలయుఁ దా నెప్పుడు పోచిరాజతనయా వినుమా |
62. |
|
|
|
|
కాపురుషుల సాంగత్యము వాపును సద్గుణము లెల్ల భాను సుతుఁ డటం బాపిగ మారె సుయోధను దాపునఁ జని పోచిరాజతనయా వినుమా |
63. |
|
|
|
|
ఆడంబరంబు లన్నియు వీడి సురుచిరాత్మశుద్ధి వినయాన్వితుఁడై వేఁడఁగ హరిని సుగతులం దా డాయును బోచిరాజతనయా వినుమా |
64. |
|
|
|
|
పృథివిని సుధనిభ మధువున్ వ్యథ లొనగూర్చు మధుమేహ బాధితు లయినన్ వృథఁ జన దార్యోక్తి యథా తథముం జనఁ బోచిరాజతనయా వినుమా |
65. |
|
|
|
|
కలుష పది యయ్యె నిప్పుడు కలియుగ మేక పద ధార్మిక మనఁగఁ దగునే కల యందున ధర్మము భూ తలమున నిఁకఁ బోచిరాజతనయా వినుమా |
66. |
|
|
|
|
తామసము వీడి భక్తి ప్రేమల నిడ లేశమైనఁ బ్రీతిలు ఖలునిన్ హేమాద్రి నొల్లఁడు పరం ధాముఁ డెపుడు పోచిరాజతనయా వినుమా |
67. |
|
|
|
|
ఇచ్చలు తీర్చుట కొఱకై యిచ్చిన మ్రొక్కగును లంచ మీశున కీయన్ నిచ్చలు భక్తియ చాలును దచ్చాడకఁ బోచిరాజతనయా వినుమా |
68. |
|
|
|
|
జనకుండు భయత్రా తా శనదాత సహానుయోక్త చను దండ్రి యన్ వనితకు నల్వురు నుపనే త నరునకుం బోచిరాజతనయా వినుమా |
69. |
|
|
|
|
అతిశయ సంపదలు మహో న్నత పదవులు భృత్యమిత్ర నందన దారల్ చితి దాఁటఁగ శక్యమె మి థ్య తరింపఁగఁ బోచిరాజతనయా వినుమా |
70. |
|
|
|
|
పదపడి చేసిన పనులే వదలవు మరుజన్మ నైన భవసాగర మీ దఁ దలఁపుము శ్రీహరి లస త్పద ద్వయముఁ బోచిరాజతనయా వినుమా |
71. |
|
|
|
|
ఇది నా దది నాది యనుచు మది నారాట పడ నేల మన మేనున నా యది యాదుల నాథుఁ డెచట తదవగతమె పోచిరాజతనయా వినుమా |
72. |
|
|
|
|
అపహాసంబు లొసంగును విపర్యయములై యిడుమలు విపరీతముగం గపటత్వమును వల దనుచి తపుఁ బనులుం బోచిరాజతనయా వినుమా |
73. |
|
|
|
|
సమయును దేవర్షినర ఋ ణములు విగత దేహుఁ డైన నరుల కనఁ బితౄ ణము దీరదు మరణము సే త మఱవకుము పోచిరాజతనయా వినుమా |
74. |
|
|
|
|
పుట్టింట నున్న యెడలం దిట్టకుమా మెట్టినిల్లుఁ దెగ మెట్టింటం బుట్టింటినిఁ బొగడకుమా దట్టంబుగఁ బోచిరాజతనయా వినుమా |
75. |
|
|
|
|
దానముల నన్న దానము మానుగ గుణముల ఘనము క్షమా గుణమున్ వి జ్ఞాన ధనము సంపదల స దా నిక్కము పోచిరాజతనయా వినుమా |
76. |
|
|
|
|
అతి వినయము ధూర్త గుణము నుతించుచు మనం బలరెడు నుడువుల లీలన్ వెత లిడుదురు ధూర్తులు సం తత మిద్ధరఁ బోచిరాజతనయా వినుమా |
77. |
|
|
|
|
పన్నుగఁ గన్పడు దైవము కన్నకడుపు మిన్న యౌను గన్నని కన్నం గన్నడ చేయం దగునే తన్నెప్పుడుఁ బోచిరాజతనయా వినుమా |
78. |
|
|
|
|
సిరి పుష్కలముగఁ గలదని
నరులం గించపఱచిన ఘనమ్ముగ నిత్యం బరయము నిష్కృతి యఘ మి ద్ధరఁ బెరుఁగును బోచిరాజతనయా వినుమా |
79. |
|
|
|
|
ప్రియవాదులు మెండిల న ప్రియ మైనను మేలొనర్చు రీతి పలుకు వ క్తయు శ్రోతయు దుర్లభులే దయనీయము పోచిరాజతనయా వినుమా |
80. |
|
|
|
|
కోరిన కరమే కొట్టును బేరిమి గలచోట నుండు బెను సందియమున్ గారము సెరచును బిల్లల దారుణముగఁ బోచిరాజతనయా వినుమా |
81. |
|
|
|
|
కాల వశాపన్నుఁడు పోఁ గాలము దరిఁ జేర దుష్ట కార్యము లెల్లన్ లీలగఁ జేసిన కతనం దా లయమగు బోచిరాజతనయా వినుమా |
82. |
|
|
|
|
జీవన చక్ర గమన ధా రావాహిక నాఁపఁ గల నరవరులు గలరే జీవుల జనన మరణములు దైవతములు పోచిరాజతనయా వినుమా |
83. |
|
|
|
|
గురువులు పెద్దలు మునులు వి వరించిన గతిఁ జనఁ దగును వారల దారిన్ నరులకుఁ జనఁ దగ దఘముల దరి దాఁటఁగఁ బోచిరాజతనయా వినుమా |
84. |
|
|
|
|
హాసక్లేశముల మనము దాసారి నిభానల గతిఁ దనరు ననిశమున్ రోసము వీడిన వర్తిలు దాసుని వలె బోచిరాజతనయా వినుమా |
85. |
|
|
|
|
శోక మొసఁగు ధన నష్టము శోకము శ్రుతముల హరించు సురుగు నఖిలమున్ శోకేతరమ్ము లేదికఁ దాఁకఁగ మదిఁ బోచిరాజతనయా వినుమా |
86. |
|
|
|
|
శోకమ్ము వీడి ధైర్యము సాకిన దుష్కరము లెల్లఁ జలుప నిరాశం జేకొనఁ డుత్సుకుఁడు మది స దా కొంచెముఁ బోచిరాజతనయా వినుమా |
87. |
|
|
|
|
కాయమ్మునకుం దగిలిన గాయమ్ములు మాను కాల గమనం బైనన్ మాయునె మనసును ఘనముగ దాయపఱుపఁ బోచిరాజతనయా వినుమా |
88. |
|
|
|
|
విజ్ఞాన మెంత యున్న న వజ్ఞేయులె తొలఁగిన భగవ దభిజ్ఞానం బజ్ఞానులె వర్జింపఁ గృ తజ్ఞతనుం బోచిరాజతనయా వినుమా |
89. |
|
|
|
|
తప్పులు సేసిన నెప్పుడు గప్పుకొనక దిద్దు కొనినఁ గమనీయంబే యొప్పగు నడచిన సుగతులఁ దప్పక యిఁకఁ బోచిరాజతనయా వినుమా |
90. |
|
|
|
|
ఆరంభమ కష్టము పలు మారులు సేయు నొకపరి కుమతియై చేయన్ వారింపు ప్రధమ దోషము ధారుణినిం బోచిరాజతనయా వినుమా |
91. |
|
|
|
|
తీరిన కొలదిం బెరుగును గోరిక లిద్ధర ధనాశకు నవధి కలదే పేరాస చెఱచు నరులను దారుణముగఁ బోచిరాజతనయా వినుమా |
92. |
|
|
|
|
కష్టంబ కలి యుగమ్మున నిష్టిని ధర్మాచరణము నెఱిఁగి వసింపన్ దృష్టిడ ధర్మమ్మున దా దాష్టీకుఁడె పోచిరాజతనయా వినుమా |
93. |
|
|
|
|
పశుసుత పత్న్యాదు లరయ వశులై యుందురు ఋణాను బంధము తీరన్ విశదం బెల్లరుకున్ వసు ధ శమించుట పోచిరాజతనయా వినుమా |
94. |
|
|
|
|
పౌరుష వాక్యము సనునే భూరి గుణాఢ్యుల కశేష పుణ్య జనులకున్ ఘోర గరళ దహన సదృశ దారుణ మది పోచిరాజతనయా వినుమా |
95. |
|
|
|
|
సత్పురుషులు మునివరులు ప రాత్పర విమలాంచిత పద లాలిత సేవా తత్పరులున్నేరరు హరి తాత్పర్యము పోచిరాజతనయా వినుమా |
96. |
|
|
|
|
లోకపు భాషల మతముల భీకర భేదంబు నున్న విశ్వేశ్వరుఁ డే కైక విభుఁడ నదులకు ర త్నాకరు వలెఁ బోచిరాజతనయా వినుమా |
97. |
|
|
|
|
చేతన మసువుల తోడ న చేతన మవి లేకయున్న జెప్ప నలవియే వీతంపుఁ బదార్థము కల దా తనువునఁ బోచిరాజతనయా వినుమా |
98. |
|
|
|
|
సాధించితి రని పెక్కులు మేధావంతులు నరు లన మిథ్యయ గాదే మేధ నొసంగినది హరి గ దా ధరణిం బోచిరాజతనయా వినుమా |
99. |
|
|
|
|
సృజియించితి రద్భుతములు నిజముగ విశ్వనియమముల నేర్పునఁ గూర్పం గ జగతి లేని యణువు గల ద! జనితములఁ బోచిరాజతనయా వినుమా |
100.
|
|
|
|
|
సకల చరాచర జీవ గ ణ కారక వికాస విలయ నట నాసక్తుం డకళంకాత్ముఁడు దురితాం తకుండు హరి పోచిరాజతనయా వినుమా |
101.
|
ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్య సుందరీ
పేర్రాజ దంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ
ప్రణీతంబైన
నిత్యసత్య సూక్తులను పోచిరాజ శతకము
|
|
పోచిరాజ శతకము (నిత్య సత్య సూక్తులు) |
|
గ్రంథ కర్తృ దంపతులు |
వివరములు:
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design)
స్వగ్రామము:
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఉద్యోగము:
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of
India Undertaking), Hyderabad.
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College
Hyderabad.
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, Raipur.
నివాసము: H.No. 19, Shiva Residency, Phase
1, Mathpurena, Raipur, Chchattisghar - 492013
Cell. Nos. 8602787525, 9440378434.
స్వీయ రచనలు:
1.
రామ చంద్ర శతకము.
2.
పోచిరాజ శతకము.
3.
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద
కావ్యము- సప్తాశ్వాసములు).
4. వేంకటేశ్వరా శతకము
(అష్టోత్తర శతనామ సంభృతము).
5.
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి
రామాయణానువాదము, 68 సర్గలు).
6.
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము
(శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక
క్రమానువాదము).
7.
శ్రీమన్నారాయణ శతకము.
8.
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100
దశకములు).
9.
శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ
స్తోత్ర మాలిక.
10.
మాహేశ్వర దండకము.
11.
మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.
12.
ఉదాహరణ కావ్యము_ దొడ్డవర
సోమేశ్వరుఁడు
13.
శ్రీమదాంధ్ర రామాయణము.
14.
శ్రీ బాల రామాయణము (సంక్షిప్త
రామాయణము) (కొనసాగుచున్నది)
15.
గోవిందము.
